Tourism Workers Strike: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ టూరిజం కార్మికులు చేపట్టిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో టూరిజం కార్మికుల సంప్రదింపులు సఫలం కావడంతో వారు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. చర్చల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ రవిబాబు, అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ, టూరిజం శాఖ ఆర్.డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. గిరిజన కార్మికులకు అన్యాయం జరిగిందని అధికారులు వెల్లడించారు. కార్మికుల సమ్మెతో అరకులోయలోని మయూరి హరిత రిసార్ట్, హరిత వ్యాలీ రిసార్ట్, అనంతగిరి మండలంలోని బర్రా గుహలు, టైడా జంగిల్ బెల్స్, అనంతగిరి హరిత హిల్ యూనిట్లు మూతపడిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.
Also Read: Gudivada Amarnath: ఢిల్లీలో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్
కార్మికుల సమస్యలను డిసెంబర్ 31లోగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. శాలరీ పెంపు, బస్సు పాసు, డెత్ అలవెన్స్ పెంపు ఈ నెలాఖరు కల్లా అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లన్నిటిని డిసెంబర్ 31 పూర్తి చేస్తామని, ఇతర ప్రభుత్వాల వలె కాక, అన్న మాట మీద నిలబడి కార్మికుల సంక్షేమానికి చేయాల్సిందంతా చేస్తామనీ, కార్మికుల వెంట ఉంటామనీ అధికారులు, నాయకులు హామీలు ఇచ్చారు. అధికారుల హామీలు నమ్మదగినవిగా ఉన్నాయని అందుకే సమ్మె విరమిస్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. రేపు(నవంబర్ 15) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అరకులోయ పర్యటనకు వెళ్లనున్నారు.