Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మనబడి నాడు-నేడు అనే కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. దీంతోపాటు అమ్మఒడి పథకం కింద రూ.15వేలు ఇస్తుండటంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరిక సంఖ్య కూడా పెరిగింది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాల, ఉన్నత విద్య కరిక్యులమ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమీక్ష చేయనున్నారు. సాయంత్రం మూడున్నర గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరపనున్నారు. వర్చువల్ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్ రియాలిటీపై ఇప్పటికే ముఖ్యమంతచ్రి సమీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సమీక్షా సమావేశంలో విద్యా ప్రమాణాల పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
విద్యారంగంలో మార్పు తీసుకురావటంలో తమ ప్రభుత్వం ముందుందని గతంలో సీఎం జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. విద్యారంగాన్ని రానున్న రోజుల్లో ప్రక్షాళన చేస్తున్నట్లు ఆయన గత నెలలో ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఐఎఫ్‌పీ స్క్రీన్‌లు, స్మార్ట్ పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
ఇదిలా ఉండగా.. ఉన్నత విద్యపై కూడా సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇవాళ ఉదయ 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సమస్యలపై చర్చించనున్నారు.