ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం నాడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి కూడా జగన్ హాజరుకానున్నారు. ధర్మశ్రీ కుమార్తె వివాహం విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. కాగా అంతకుముందు విశాఖ నగరంలో పలు అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
Read Also: సమంత పరువునష్టం కేసు తీర్పు వాయిదా
సీఎం జగన్ తొలుత శనివారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి సాయంత్రం 4:45 గంటలకు విశాఖ చేరుకుంటారు. విశాఖ ఎయిర్ పోర్టు గేట్-1 వద్ద ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో 20 నిమిషాల పాటు జగన్ ముచ్చటించనున్నారు. అనంతరం ఎన్ఏడీ జంక్షన్ లో ఫ్లైఓవర్, వీఎంఆర్డీఏ ప్రాజెక్టులను జగన్ ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి వుడా పార్క్, జీవీఎంసీ స్మార్ట్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె పెళ్లికి హాజరవుతారు. ఆ తర్వాత విశాఖ నుంచి గన్నవరం తిరుగు ప్రయాణమవుతారు.