ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు అందాలని అధికారులకు సూచించారు. నేడు 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయి’ అని అధికారులను హెచ్చరించారు. ‘రాష్ట్రంలో ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదుఇస్తున్నాము. నేటికి 1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్లు చెల్లింపులు చేశాం. గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ జరిగింది. ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుతో రికార్డు నెలకొల్పాం’ అని సీఎం పేర్కొన్నారు.