ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మేలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలును ప్రజలకి వివరించాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ టూర్లపై కేబినెట్ భేటీలో చర్చించారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని మంత్రి పయ్యావుల ప్రస్తావించారు.
ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లల్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ 200 దేశ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఇ-మెయిల్స్ పెట్టారని సీఎం దృష్టికి ఆర్థిక మంత్రి పయ్యావుల తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతిపరుడితో ఇ-మెయిల్స్ పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపారు. తప్పులు చేసి.. ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని సీఎం అన్నారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి వాటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం మంత్రులకు సూచనలు చేశారు.
Also Read: ENG vs IND: 9 పరుగులే.. కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్న శుభ్‌మన్ గిల్!
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఇ-మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం చంద్రబాబును పలువురు మంత్రులు కోరారు. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసేలా ఇ-మెయిల్స్ పెట్టిన అంశంపై సీఎం విచారణకు ఆదేశిస్తామని మంత్రివర్గ సమావేశంలో సీఎం ప్రకటించారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తోందన్న సీఎం సీరియస్ అయ్యారు. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని పలువురు మంత్రులు గుర్తు చేశారు.