అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను గాల్లో కలిపేసింది. శ్రీరామనవమి వేడుకల్లో గ్రామమంతా ఆనందోత్సవాల్లో ఉన్న సమయంలో అక్కడ చిన్నారుల మృతి వార్త విషాదాన్ని నింపింది. చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో నరసరాజు కుమారుడు దేవాన్, శేఖర్ రాజు కుమారుడు విజయ్, వెంకటేష్ కుమారుడు యశ్వంత్ అప్పటివరకు సీతారాముల ఊరేగింపులో పాల్గొని.. ఈత కోసం సమీపంలోని చెరువులోకి వెళ్లారు. మట్టి కోసం తవ్విన గుంటల్లో ఈత కోసం దిగిన ముగ్గురు చిన్నారులు మునిగి మృత్యువాత పడ్డారు.
సాయంత్రం అయినా చిన్నారులు ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు రామాలయం గుడి వద్ద ఉన్నారనుకుని నిర్లక్ష్యం చేశారు. అయితే చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో.. చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన గ్రామస్తులకు చేదు వార్త తెలిసింది. గ్రామ సమీపంలోని చెరువులో ఉన్న గుంటలో ఓ చిన్నారి మృతదేహం కనపడటంతో.. మరో ఇద్దరి కోసం అదే గుంటలో గాలించారు. ముగ్గురు చిన్నారులు విగత జీవులు కావడంతో అక్కడ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండగ రోజే ఎం రాచపల్లిలో విషాదం చోటుచేసుకోవడంతో.. గ్రామస్థులు కన్నీటి పర్యంతం అయ్యారు.