Arogyasri: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించామని.. శుక్రవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి మా వినతిని తెలిపామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే వారంలో రూ. 300 కోట్లు బకాయిల సొమ్ము విడుదల చేస్తామని సీఎస్ మాటిచ్చారని వారు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన సీఎస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు యధాతధంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలందిస్తామన్నారు.
Read Also: Palnadu: పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న పోలీస్ ఆపరేషన్
గతంలో ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల నుంచి ఉన్న రూ.1500 కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పెండింగ్ బిల్లుల్ని చెల్లించకపోతే సేవల్ని నిలిపివేస్తామని అసోసియేషన్ తెలిపింది. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు స్ట్రైక్ కంటిన్యూ చేయడంతో మూడో రోజూ సేవలు నిలిచిపోగా.. దీంతో నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడదల చేయాలని కోరారు. ఆస్పత్రుల నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎస్‌కు వివరించారు. పెండింగ్ నిధుల విడుదలపై సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు డాక్టర్ రమేష్.