CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ రచనలో తెలుగువారి చిరస్మరణీయ పాత్రను గుర్తుచేశారు. 2025 సంవత్సరానికి రూపొందించిన అసెంబ్లీ క్యాలెండర్‌ను తన నివాసంలో శనివారం ఆవిష్కరించిన సందర్భంగా, తెలుగు ప్రముఖుల చిత్రాలతో, చరిత్రను ప్రతిబింబించేలా ఈ క్యాలెండర్ రూపొందించినట్లు సీఎం తెలిపారు.
ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోందని, ఈ సందర్భంలో రాజ్యాంగ రచనలో పాల్గొన్న తెలుగు ప్రముఖులను స్మరించుకుంటున్నామని చెప్పారు. గోబ్యాక్ సైమన్ ఉద్యమంలో ధైర్యంగా ముందుకు నడిచిన టంగుటూరి ప్రకాశం పంతులు, రాజ్యాంగంలోని స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. బోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభా సంప్రదింపుల కమిటీలో సభ్యునిగా తన సేవలు అందించారని, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ జాతీయ భాష, న్యాయవ్యవస్థ, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై చేసిన కీలక సూచనలను రాజ్యాంగ సభ ఆమోదించిందని అన్నారు.
Suresh Babu : అప్పుడు ఇండస్ట్రీలోకి రావాలనే అసక్తే లేదు..
మోటూరి సత్యనారాయణ జాతీయ భాషపై, ఎన్జీ రంగా అధికార వికేంద్రీకరణపై, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుపై తమ సూచనలు అందించారని గుర్తు చేశారు. వీరితో పాటు వీసీ కేశవరావు, అల్లాడి కృష్ణస్వామి, మొసలికంటి తిరుమలరావు, కళా వెంకట్రావు వంటి ప్రముఖులు రాజ్యాంగ నిర్మాణంలో తమ వంతు సేవలు అందించారని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ చిత్రాలతో అసెంబ్లీ క్యాలెండర్ రూపొందించడం గర్వకారణమని, ఇలాంటి గొప్ప వ్యక్తుల సేవలను స్మరించడం తనకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తదుపరి, సీఎం చంద్రబాబు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గురించి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందిస్తూ, విజయవాడలో ఈ మహాసభల నిర్వహణ తెలుగువారందరికీ గర్వకారణమని తెలిపారు. భవిష్యత్ తరాలకు మాతృభాషను పదిలంగా అందించడమే లక్ష్యమని పేర్కొన్న ఆయన, ఈ మహాసభల ప్రధాన ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడాన్ని ప్రశంసించారు. తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరును ప్రధాన వేదికకు ఇవ్వడం అభినందనీయమన్నారు. మహాసభలకు విచ్చేసిన అతిథులు, తెలుగు భాషాభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిర్వాహకుల కృషిని కొనియాడుతూ, వారిని అభినందించారు.