Purandeshwari: బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలను పురంధేశ్వరి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు పురంధేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తుల ప్రకటన వంటి అంశాలను హైకమాండ్ దృష్టికి పురంధేశ్వరి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. పవన్ పొత్తుల ప్రకటన గురించి పురంధేశ్వరి బీజేపీ పెద్దలతో చర్చించిన అనంతరం ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Penukonda MLA: ఎమ్మెల్యే శంకరనారాయణ కాన్వాయ్‌పై డిటోనేటర్‌తో దాడి
ఇదిలా ఉండగా.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పరిస్థితులపై పురంధేశ్వరి ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. దీంతో పాటు పురంధేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టాక అసలు ఏపీ బీజేపీలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న అంశంపై కూడా ఢిల్లీ పెద్దలు ఆసక్తిగా ఉన్నారు. ఏపీలో ఉన్న తాజా రాజకీయాలపై ఓ నివేదికను సిద్ధం చేసిన బీజేపీ నేతలు అధ్యక్షురాలు పురంధేశ్వరి ముందు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఎవరి మద్దతుతో వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్లాలన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ బీజేపీ నేతలు ఓ నిర్ణయానికి రావచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల నిర్వహించిన కోర్ కమిటీలో సభ్యుల అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలకు బీజేపీ ఏపీ చీఫ్ వివరించనున్నారు. త్వరలో బీజేపీ ఏపీ విస్తృత స్థాయీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా జేపీ నడ్డాను పురంధేశ్వరి ఆహ్వానించనున్నారు.