మన దేశంలోని చాలా కుటుంబాల్లో ఆడబిడ్డల కంటే మగ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. సామాజిక, ఆర్థిక కారణాలవల్ల కొడుకును ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించడం అనాదిగా వస్తోంది. దాంతో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతోమంది గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించుకుంటున్నారు. కడుపులోని ఆడబిడ్డను కడతేరుస్తున్న ఘటనలు మన దేశంలో అనేకం జరుగుతూనే ఉన్నాయి. పూట గడవని పేదలే కాదు, సంపన్నులు సైతం భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి మరో ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. కన్న తల్లి తన బిడ్డను భారంగా భావించింది. అమ్మతో కలిసి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడింది.
READ MORE: New Law: లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా కొత్త చట్టం?
అసలేం జరిగిందంటే.. నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో తల్లి, మరో మహిళ అప్పుడే పుట్టిన పసిపాప గొంతు కోశారు. దీంతో చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. చనిపోయిందని భావించి చెత్త కుండీలో పారేసి వెళ్లిపోయారు. కొంత సేపటి తర్వత చిన్నారికి స్పృహ వచ్చింది. నొప్పి తట్టుకోలేక బోరున విలపించింది. గమనించిన స్థానికులు చిన్నారిని భోపాల్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నెల రోజుల పాటు కష్టపడి చిన్నారికి వైద్యం చేశారు. శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశారు. పసిపాప బతకడం అద్భుతమని డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మృత్యుంజయురాలిని ముద్దుగా పిహు అని పిలుచుకున్నారు. బాలల సంక్షేమ కమిటీ అనుమతితో రాజ్‌గఢ్‌లోని ఓ సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై చిన్నారి తల్లి, అమ్మమ్మను అరెస్ట్ చేశారు.
READ MORE: Film Industry : రెమ్యునరేషన్స్ ఎఫెక్ట్.. జూన్ 1 నుంచి షూటింగ్స్ బంద్..