పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అదానీ గ్రూప్ ఛత్తీస్‌గఢ్‌లో మైనింగ్ లాజిస్టిక్స్ కోసం భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్కును విడుదల చేసింది. 40 టన్నుల వరకు వస్తువులను మోసుకెళ్లగల ఈ ట్రక్కును ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి రాయ్‌పూర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రక్కును గారే పాల్మా బ్లాక్ నుంచి రాష్ట్ర విద్యుత్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా చేయడానికి ఉపయోగిస్తారని చెబుతున్నారు.
ఈ హైడ్రోజన్ ట్రక్కులు కంపెనీ లాజిస్టిక్స్ కార్యకలాపాలలో ఉన్న డీజిల్ ట్రక్కులను క్రమంగా భర్తీ చేస్తాయని, రాబోయే కాలంలో వాటి సంఖ్యను పెంచుతామని అదానీ గ్రూప్ చెబుతోంది. ఈ హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కు ఒకేసారి 200 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. మూడు హైడ్రోజన్ ట్యాంకులతో అమర్చబడిన ఈ ట్రక్కు, లోడ్ సామర్థ్యం, పరిధి పరంగా డీజిల్‌తో నడిచే భారీ వాహనాలతో పోటీ పడేలా రూపొందించారు.
ఈ హైడ్రోజన్ ట్రక్ కర్భన ఉద్గారాలను చాలా వరకు తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. కార్బన్ డయాక్సైడ్, ఇతర కాలుష్య కారకాలను విడుదల చేసే సాంప్రదాయ డీజిల్ ట్రక్కుల మాదిరిగా కాకుండా, హైడ్రోజన్ ట్రక్కులు నీటి ఆవిరి, వేడి గాలిని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. వాణిజ్య వాహన రంగంలో ఇది అత్యంత పరిశుభ్రమైన ఆప్షన్ గా నిలువనుంది. దీనివల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.