Shallini Kidnap Case: సిరిసిల్ల యువతి శాలిని కిడ్నాప్ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆ యువతి వీడియోను విడుదల చేసింది. నాలుగేళ్లుగా జానీని ప్రేమిస్తున్నట్లు ఆ యువతి వెల్లడించింది. జానీని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు శాలిని తెలిపింది. వివాహానికి సంబంధించిన వీడియోలను జానీ, శాలినిలు విడుదల చేశారు. తన కోరికపైనే జానీ తనను తీసుకెళ్లాడని శాలిని పేర్కొంది. మా తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తు్న్నారని.. వచ్చి తీసుకెళ్లమని తానే చెప్పినట్లు ఆ యువతి వెల్లడించింది. తీసుకెళ్లే ముందు మాస్క్ ఉండడం వల్ల జానీని గుర్తుపట్టలేదని.. గుర్తుపట్టిన తర్వాత ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చూసుకున్నానని శాలిని వెల్లడించింది.
ఆమె ఈ వివరాలు వెల్లడించడంతో ఈ కేసు కొలిక్కి వచ్చినట్లుయింది. గతంలో జానీ, శాలినికి ఇదివరకే పెళ్లి అయ్యింది. అయితే.. శాలిని మైనర్ కావడం, ఈ పెళ్లి కూడా ఇష్టం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ కేసులో జానీ పది నెలల జైలు శిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జానీ మళ్లీ శాలినికి దగ్గర అవుతుండడంతో.. తల్లిదండ్రులకు ఆమెకు మరో యువకుడితో నిన్న (సోమవారం) నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న జాన్.. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ వ్యవహారానికి తెరలేపాడు. తెల్లవారుజామున ఆలయంలో పూజ ముగించుకొని శాలిని బయటకు రాగానే.. ఆమె తండ్రి ముందే తన స్నేహితుల సహకారంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శాలిని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Minister KTR Serious: యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్
మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు శాలిని తన తండ్రితో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లింది. పూజ ముగించుకొని బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ తన స్నేహితులతో మాటువేసిన జానీ.. శాలిని బయటకు రావడం గమనించి, వెంటనే కార్ వేసుకొని ఆలయం ముందుకు వచ్చాడు. బలవంతంగా ఆమెని కారులో ఎక్కించుకున్నాడు. తండ్రి ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు కానీ, జానీ స్నేహితులు ఆయన్ను అడ్డుకున్నారు. అటు శాలిని పారిపోవడానికి ప్రయత్నించగా, మరో యువకుడు ఆమెని పట్టుకొని కారులో ఎక్కించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.