ఆరు నెలలు జైల్లో గడపడం.. తనలో ఎంతో మనోధైర్యాన్ని పెంచిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకెళ్లిన సంజయ్ సింగ్ బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు జైలు దగ్గర ఘన స్వాగతం లభించింది.
తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. ఆరు నెలలు జైల్లో గడపడం.. తనలో ఎంతో మనోధైర్యాన్ని పెంచడంతో పాటు అన్యాయం, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్న సంకల్పాన్ని మరింత పెంచిందని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం కేజ్రీవాల్‌తో పాటు మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లు త్వరలోనే విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయొద్దన్న పార్టీ వైఖరిని సంజయ్ సింగ్ సమర్థించారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరన్న లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నుకున్నారా? అని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఉచిత విద్య, నీటి సదుపాయం, బస్సు సర్వీసులు, యువతకు ఉపాధి కోసం ఢిల్లీలోని రెండు కోట్ల ప్రజలు కేజ్రీవాల్‌ను సీఎంగా ఎన్నుకున్నారని తెలిపారు.