Young Man dies with Heart Attack While Playing Cricket in Nandyala: దేశంలో గుండెపోటుతో ఆకస్మిక మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో అనధికారికంగా వందలాది మంది మృతి చెందారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. యువకులు కూడా గుండెపోటుతో చనిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని ఓ యువకుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.
బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన 22 ఏళ్ల మహేంద్ర ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడాడు. కాలనీ సమీపంలో తన స్నేహితులతో కలిసి ఆడుతూనే అతడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కంగారుపడిపోయిన స్నేహితులు చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. స్థానికులు వెంటనే మహేంద్రను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహేంద్ర అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. చేతికందివచ్చిన కొడుకు హఠాత్తుగా దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Tirumala Cheetah: తిరుమల కాలినడక భక్తులకు ఊరట.. బోనులో చిక్కిన చిరుత!
గత ఏప్రిల్ 7వ తేదీన కూడా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో క్రికెట్ ఆడుతుండగా ఆంజనేయులు అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. క్రికెట్ అడుతున్న సమయంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. గతంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో 13 ఏళ్ల బాలిక కూడా గుండెపోటుతో మరణించింది. గత కొన్నేళ్లుగా వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.