Cheetah Caught in Cage at Tirumala: తిరుమల కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. తాజాగా తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత బోనులో చిక్కింది. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడవ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అది పెద్ద చిరుత అని, దాని వయసు 5 సంవత్సరాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత తన తల్లిదండ్రులతో కలిసి అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా.. చిరుత ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. కాలినడక మార్గంలో వెళ్లే భక్తులు బయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీ అధికారులు నాలుగు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. పాద ముద్రల ఆధారంగా 5 చిరుతపులు ఉన్నట్లు గుర్తించారు.
Also Read: IND vs WI: ఐదో టీ20లో భారత్ పరాజయం.. విండీస్‌కు సిరీస్ సమర్పయామి! ఇదే తొలిసారి
లక్షిత మృతి నేపథ్యంలో ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈరోజు తెల్లవారుజామున చిరుత చిక్కింది. చిన్నారిని చంపింది ఇదే చిరుత అని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఓ చిన్నారిపై చిరుత దాడి చేయగా.. దాన్ని బంధించి కల్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.