విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌పై చర్చించారు. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా విశేషమైన స్పందన లభిస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం 27 వేల మంది కెపాసిటీని కలిగి ఉందని.. ఈ మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు.
విశాఖలో టీ20 మ్యాచ్ కోసం ఎక్కువ మొత్తంలో టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి చెప్పారు. రూ.5వేలు, రూ.2,500, రూ.500, రూ.250 ధరల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. 2019లో జరిగిన మ్యాచ్ కోసం 1,100 సిబ్బందిని పెట్టామని గుర్తుచేశారు. త్వరలో జరగనున్న మ్యాచ్‌కుట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మ్యాచ్‌కు వచ్చే సమయంలో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. అయితే మ్యాచ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్లే సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. వాటిని అధిగమించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లేయర్స్ ఉండే హోటల్స్ దగ్గర పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.