గంజాయి స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పుష్ప రేంజ్‌లో స్మగ్లింగ్ దందా కోసం ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు సక్సెస్‌ఫుల్‌గా దందా కొనసాగించినా.. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..!! గంజాయి బాగోతం కాస్తా పోలీసులకు గుప్పుమనడం.. వారు సోదాలు చేయడం.. వీళ్లు దొరికిపోవడం జరుగుతోంది. ఐతే పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు చేసినా.. స్మగ్లర్లు ఒక్కోసారి వేసిన స్కెచ్‌కు పోలీసులే షాకవుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ ధూల్‌పేట్‌లో అదే జరిగింది.
Also Read:HYD STEROIDS ARREST: కండలు కాదు, బుడగలు.. స్టెరాయిడ్ మాఫియా గుట్టురట్టు..
ఒకప్పుడు గుడుంబాకు అడ్డా ధూల్‌పేట్.. ధూల్‌పేట్‌లో ఇప్పుడు గంజాయి గుప్పుమంటోంది. ఎన్నిసార్లు దాడులు చేసినా.. దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా స్మగ్లర్లు కొనసాగిస్తూనే ఉన్నారు.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పుష్ప రేంజ్‌లో స్కెచ్చులు వేస్తున్నారు.. తాజాగా మరోసారి అలాంటి స్కెచ్చే వేశారు. కానీ పోలీసులు పసిగట్టే సరికి గంజాయి స్మగ్లర్లు బిక్కముఖం వేశారు..
ధూల్‌పేట్ మచిలీపుర ప్రాంతంలో గంజాయి నిల్వ చేశారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. రోహిత్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కానీ గంజాయి ఎక్కడా పట్టుబడలేదు. ఐతే బాత్‌రూమ్ పైపులో నుంచి ఓ దారం కిందకు వేలాడుతూ అనుమానాస్పదంగా కనిపించింది. తీగ లాగితే డొంక కదిలినట్టు.. దారం లాగితే గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. చిన్న చిన్న పొట్లాల్లో గంజాయిని చక్కగా ప్యాక్ చేసి మరీ పైపులో పెట్టారు. అలా దారం లాగి.. ఏకంగా 2.936 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో రోహిత్ సింగ్, రోహన్ సింగ్, వీణా బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక అదే ధూల్‌పేట్‌లో మరో కేసులో 1.550 కేజీల గంజాయి పట్టుకున్నారు పోలీసులు. పురాణపూల్ రోడ్డులోపక్కా సమాచారంతో మాధవ్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో దాడి చేశారు. గంజాయి పట్టుబడడంతో మాధవ్ సింగ్, అరుణ్‌బాయిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆటోలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆటోను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో నందిని సింగ్, శిల్పా కూడ నిందితులుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
అటు మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామా శివారులోని విటలేశ్వర మందిరం వెనుక భాగంలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తోటను ఎక్సైజ్ పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. సంగారెడ్డి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భాగంగా ఈ సాగు బయటపడింది. గుడి వెనుక పొదల్లో అక్రమంగా పెంచుతున్న సుమారు 600 గంజాయి మొక్కలను పోలీసులు పూర్తిగా పీకివేసి నాశనం చేశారు. అదేవిధంగా అక్కడే నిల్వ ఉంచిన సుమారు 15 కిలోల ఎండు గంజాయిను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి సాగు చేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. అక్రమ మాదక ద్రవ్యాల సాగు, రవాణా, నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.