Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాలు, పట్టణాల పేర్లను మార్చారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామ పేరును ‘‘కబీర్ ధామ్’’గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకున్నట్లు సీఎం యోగి చెప్పారు. కొత్త పేరు సంత్ కబీర్‌తో ఈ ప్రాంతం చారిత్రక-సాంస్కృతిక అనుబంధాన్ని పునరుజ్జీవింపజేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. “స్మృతి మహోత్సవ్ మేళా 2025”లో సీఎం దీనిని ప్రకటించారు. ముస్తఫాబాద్ అనే పేరు ఉన్నప్పటికీ ఈ గ్రామంలో ఒక్క ముస్లిం నివాసితుడు లేకపోవడంపై యోగి ఆశ్చర్యాన్ని వ్యక్తి చేశారు.
Read Also: Montha Cyclone Effect: తీరాన్ని తాకిన ‘మొంథా’ తుఫాన్.. అక్కడ 8:30 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేత..
సభలో యోగి మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రామం గురించి నేను అడిగినప్పుడు, దాని పేరు ముస్తఫాబాద్ అని నాకు చెప్పారు. ఇక్కడ ఎంత మంది ముస్లింలు నివసిస్తున్నారని నేను అడిగాను మరియు ఎవరూ లేరని నాకు చెప్పారు. అప్పుడు పేరు మార్చాలని చెప్పాను. దీనిని కబీర్‌ధామ్ అని పిలవాలి’’ అని చెప్పారు. ‘‘గతంలో పాలించిన వారు అయోధ్యను ఫైజాబాద్‌గా, ప్రయాగ్‌రాజ్‌ను అలహాబాద్‌గా, కబీర్ ధామ్‌ను ముస్తఫాబాద్‌గా మార్చారు. మా ప్రభుత్వం దానిని తిప్పికొడుతోంది.’’ అని అన్నారు. ప్రతీ తీర్థయాత్ర స్థలాన్ని అందంగా తీర్చిదిద్దుతామని యోగి హామీ ఇచ్చారు. కాశీ, అయోధ్య, కుషినగర్, నైమిషారణ్య, మధుర-బృందావన్, బర్సానా, గోకుల్ ఇలా ప్రతీ ప్రార్థనా స్థలాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం బీజేపీ పరిపాలనలో ప్రజా నిధులు వినియోగం మారిందని చెప్పారు. గతంలో ప్రజల డబ్బుతో కబ్రస్థాన్(స్మశాన వాటికలు) సరిహద్దు గోడలు నిర్మించేందుకు ఉపయోగించేవారని, ఇప్పుడు మన విశ్వాస కేంద్రాలు, వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నామని అన్నారు. మన నాగరికత గుర్తింపు, పునరుజ్జీవనం, భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే ప్రదేశాల వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.