పిల్లలను కనడమే కాదు.. వారిని కంటికి రెప్పలా కాపాడడంలో తల్లిని మించినవారు లేరు… అవసరమైతే తన ప్రాణాలను పనంగా పెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.. తన మూడేళ్ల కూతురుని చిరుత నుంచి కాపాడుకోవడానికి ఓ తల్లి చూపిన ధైర్యం, చిరుతపై చేసిన పోరాటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. తల్లీ నీకు వందనాలు.. నీ ధైర్యానికి పాదాభివందనాలు అంటున్నారు..
ఇక, మహారాష్ట్రలో తాజాగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి పుపాల్వర్ అనే మహిళ తన మూడేళ్ల కూతురితోపాటు చంద్రాపూర్ ప్రాంతలోని దుర్గాపూర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నారు. అమ్మా ఆకలి అన్న కూతురుకి అన్నం పెట్టిన జ్యోతి.. ఆ తర్వాత తన పనిలో మునిగిపోయింది.. ఇదే సమయంలో.. ఇంట్లోకి చొరబడిన చిరుత.. అన్నం తింటున్న మూడేళ్ల చిన్నారిపై దాడి చేసింది.. భయంతో వణికిపోయిన ఆ చిన్నారి కేకలు వేసింది.. ఇక, కూతురి అరుపులు విన్న జ్యోతి.. వెంటనే తన కూతురు దగ్గరకు పరుగులు తీసింది.. అప్పటికే తన కూతురిని చిరుత ఈడ్చుకెళ్తుంటే.. అది క్రూరమృగమనే విషయాన్ని తన ప్రేమ మరిపించింది.. కర్ర తీసుకుని చిరుతను వెంబడించింది. ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాటానికి దిగింది.. చివరకు తన కూతురుని ప్రాణాలతో కాపాడుకుంది..
ఆ మహళ పోరాటం ముందు తోక ముడిచిన చిరుత పరుగులు పెట్టింది.. ఆ తర్వాత తీవ్రంగా గాయపడ్డ ఆ చిన్నారిని స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించింది జ్యోతి… ఈ సందర్భంగా జరిగిన ఘటన గురించి వివరించిన జ్యోతి.. కర్రతో చిరుత మూతిపై పదే పదే కొట్టానని.. దీంతో అది తన కూతుర్ని వదిలేసి వెల్లిపోయిందని తెలిపారు.. ఇక, చిన్నారిని వదిలేసిన తర్వాత కూడా చిరుతపై తాను దాడి ఆపలేదని.. దాంతో అది అక్కడి నుంచి పరుగులు తీసిందని వివరించారు జ్యోతి. అయితే, ఆ ప్రాంతంలో చిరుత దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు.. ఇప్పటికే ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 15 మందిని చిరుత పొట్టన పెట్టుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..