Devendra Fadnavis: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సావర్కర్, హెడ్గేవార్ సిలబస్ ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించింది. గతంలో బీజేపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులన్నింటిని రద్దు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తన మాజీ మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రేని టార్గెట్ చేశాడు. గతంలో రాహుల్ గాంధీ సావర్కర్ పై విమర్శలు చేసిన సందర్భంలో ఉద్దవ్ ఠాక్రే అతనిపై విమర్శలు గుప్పించాడు. సావర్కర్ తమకు దేవుడని, రోల్ మోడల్ అని అతడిని అవమానిస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
Read Also: iQoo Neo 7 Pro: iQoo స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూశారంటే అదిరిపోద్ది.. త్వరలో మార్కెట్లో లాంఛ్..!
అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సావర్కర్ సిలబస్ తొలగించడంపై ఎందుకు నోరు మెదపడం లేదని ఫడ్నవీస్, ఉద్దవ్ ఠాక్రేని ప్రశ్నించారు. అధికారం కోసం ఠాక్రే సిద్ధాంతం, భావజాలంపై రాజీ పడ్డాడని ఆరోపించారు. ఒక పుస్తకం నుంచి ఒకరి పేరు చెరిపేయొచ్చు.. కానీ హృదయం నుంచి చెరిపేయలేరని ఆయన అన్నారు. అధికారం కోసం మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ తో జతకట్టాడని.. అధికారం కోసం మైనారిటీల బుజ్జగింపు జరుగుతున్నాయని మీరు అంగీకరిస్తారా..? సావర్కర్ ని అవమానించడాన్ని మీరు అంగీకరిస్తారా..? అని ప్రశ్నించారు. మీరు కాంగ్రెస్ తో జతకడుతున్నారు, వారు సావర్కర్ పేరును చెరిపేయాలని అనుకుంటున్నారని, మతమార్పిడికి మద్దతు ఇవ్వబోతున్నారని అన్నారు. మీరు అధికారంలో కోసమే రాజీ పడుతున్నారని ఉద్ధవ్ ఠాక్రేని ఫడ్నవీస్ విమర్శించారు.
బిజెపి అధికారంలో ఉన్నప్పుడు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానానికి అనుగుణంగా, సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం క్యాబినెట్ తీర్మానంలో రాష్ట్రంలో 6 నుండి 10 తరగతుల కన్నడ మరియు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను సవరించడానికి ఆమోదించింది. ఈ విద్యా సంవత్సరంలో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెడ్గేవార్ మరియు హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్‌ల అధ్యాయాలను తొలగించింది.