Vijay Rupani: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. రూపానీ ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రూపానీ రూపానీ కుటుంబానికి దగ్గరగా ఉన్న వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి తన భార్య అంజలిబెన్ రూపానీని తిరిగి తీసుకురావడానికి లండన్‌కు వెళుతున్నారు. ఆమె గత ఆరు నెలలుగా లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రూపానీ బిజినెస్ క్లాస్ విభాగంలో 2-Dలో కూర్చున్నారని విమాన రికార్డులు నిర్ధారించాయి. ఆయన మరణంతో స్వస్థలమైన రాజ్‌కోట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీజేపీ పార్టీకి కూడా పెద్ద దెబ్బ అని పార్టీ నాయకులు చెబుతున్నారు.