ఎన్నికలంటే ఓటర్లను ఆకట్టుకోవడం.. వారికి హామీల మీద హామీల గుప్పిస్తూ ఓట్లు వేయించుకోవడం. దేశంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఉత్తరాఖండ్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రజలను ఆకర్షించడానికి నాయకులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రోడ్ల పక్కన వుండే వివిధ స్ట్రీట్ ఫుడ్ షాపుల్లో నేతలు హడావిడి చేస్తున్నారు. పానీపురీ, కొబ్బరి బొండాలు, టిఫిన్ సెంటర్లు… ఇలా వేటినీ వదలడం లేదు నేతలు. సామాన్యులతో మమేకమవుతూ వివిధ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎన్నికల ప్రచారంలో తనదైన స్టయిల్ లో కనిపించి అలరించారు.
హల్ద్వానీ నగరంలోని ఓ దుకాణంలో తియ్యని జిలేబీ వేస్తూ జిలేబీవాలాలాగా మారిపోవడంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. తమ పార్టీ అభ్యర్థి సుమిత్ హృదయేష్ తరపున రావత్.. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పటికే పలుమార్లు షాపుల్లో టీ, ఛౌమీన్ చేస్తూ ప్రజానాయకునిగా పేరు తెచ్చుకున్నారు రావత్. ఎన్నికల టైం దగ్గర పడడంతో ప్రచారం తారస్థాయికి చేరింది.