Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ సిద్ధమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసులను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని క్యాబినెట్ ఆదివారం ఆమోదించింది. ఫిబ్రవరి 6 ఈ బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. డెహ్రాడూన్‌లో సీఎం ధామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Read Also: BAPS Hindu Mandir: యూఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అబుదాబి మందిరం విశేషాలు ఇవే..
బిల్లు ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ముఖ్యమంత్రికి అందజేసింది. రాష్ట్రంలో మతంలో సంబంధం లేకుండా పౌరులందరికీ ఏకరీతిన వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వ చట్టాల అందించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. మంగళవారం అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందితే.. స్వాతంత్య్రం అనంతరం యూసీసీ కోడ్‌ని ఆమోదించిన తొలి రాష్ట్రంగా దేశంలో ఉత్తరాఖండ్ నిలవనుంది.
బిల్లు ప్రధాన సిఫారసుల్లో బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తిగా నిషేధం, అన్ని మతాల్లో అమ్మాయిలకు సాధారణ వివాహ వయస్సు, విడాకుల కోసం ఒకే రకమైన విధానాలను, నిబంధనలు అమలు చేయడం వంటివి ఉన్నాయి. యూనిఫాం సివిల్ కోడ్‌పై చట్టాన్ని ఆమోదించడానికి ఫిబ్రవరి 5 నుండి 8 వరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ నాలుగు రోజుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూసీసీ అమలు అనేది 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ అని, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాత్మక చర్య కాదని సీఎం ధామి చెప్పారు. అయితే, తమ మత ప్రత్యేక చట్టాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.