UP bypolls: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఆరాధన మిశ్రా, ఏఐసీసీ సంస్థ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాండే తెలిపారు.
Read Also: Hyderabad: రాజేంద్రనగర్‌లో కిడ్నాపర్ల హల్‌చల్..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇండియా కూటమి అభ్యర్థుల విజయానికి బేషరతుగా పనిచేస్తారని నేతలు ప్రకటించారు. అభ్యర్థులంతా సమాజ్ వాదీ లేదా ఇండియా కూటమికి చెందిన ఇతర పార్టీలకు చెందిన వారని, కాంగ్రెస్ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని చెప్పారు. ఇండియా కూటమి అభ్యర్థులంతా యూపీలో జరిగే ఉపఎన్నికల్లో సైకిల్ గుర్తుపైనే పోటీలోకి దిగుతారని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ 9 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడుతాయి.