Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాదాపుగా రెండు నిమిషాల పాటు బలమైన ప్రకంపలను వచ్చాయి. ఈ భూకంపం వల్ల ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఒకే రోజులో వచ్చిన రెండో భూకంపం ఇది. ప్రస్తుతం వచ్చిన భూకంపం కేంద్ర ఫైజాబాద్ నుంచి ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Read Also: MLA Seethakka: మోడీకి, కేసీఆర్‌కి తేడా లేదు.. నోటీసులు ఇవ్వడమేంటి?
ఆఫ్ఘనిస్తాన్ లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో గతంలో భారీ భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో భూఅంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా భూకంపాలు ఏర్పడుతుంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరంగా కదులుతూ.. యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ ను నెడుతోంది. ఈ ప్రక్రియలో విడుదలైన శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది. ప్రస్తుత భూకంపం వల్ల పాకిస్తాన్ లోని పలు నగరాలు వణికాయి. భూకంపం సంభవించిన వెంటనే జమ్మూ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.