BJP: బీజేపీ చెప్పినట్లుగా ఎన్డీయే కూటమికి ‘‘400’’ సీట్లు రావడం లేదు. చివరకు 300కి దరిదాపుల్లోనే ఆగిపోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎంతో ఆశలు పెట్టుకున్న ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అనుకున్నంతగా ఫలితాలను సాధించలేదు. గత రెండు పర్యాయాలు 2014, 2019లో మొత్తం 543 ఎంపీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272ని సొంతగా గెలుచుకున్న బీజేపీ ఈ సారి మాత్రం ఆ మార్కును చేరుకోలేకపోయింది.ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 240 సీట్లకు అటూఇటూగా పరిమితమవుతోంది.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కీలక భూమిక పోషించాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి సూపర్ హిట్ అయింది. మొత్తం 80 స్థానాలు ఉన్న యూపీ గత రెండు సార్లు బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే, 2024 ఎన్నికల్లో మాత్రం ఈ రాష్ట్రం ఇండియా కూటమి ఆధిక్యతను కనబరిచింది. ప్రస్తుతం ఇండియా కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ కూటమి 37 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ధాటికి బీజేపీ నిలువలేకపోయింది. 2019లో వచ్చిన స్థానాల కన్నా తక్కువ స్థానాల్లోనే ఆధిక్యత కనబరించింది. 42 సీట్లలో టీఎంసీ 32, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
అయితే, ఇలా కంచుకోటల్లో బీజేపీ అంచనాలు తలకిందులవుతున్నా కొన్ని రాష్ట్రాలు మాత్రం బీజేపీ కూటమిని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 29 స్థానాలను కాషాయ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. కర్ణాటకలో 28 స్థానాలకు గానూ 20 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గుజరాత్‌లోని మొత్తం 26 ఎంపీ స్థానాల్లో బీజేపీ 20 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఒడిశాలో మొత్తం 21 ఎంపీ సీట్లు ఉంటే 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అస్సాం, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి మంచి ఫలితాలను నమోదు చేస్తోంది.