ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భయంతో అన్ని దేశాలు బూస్టర్ డోస్ పై చర్చను ప్రారంభించాయి. అభివృద్ధి చెందిన దేశాలలో బూస్టర్ డోస్‌ను వారి ప్రజలకు ఇస్తున్నాయి. అయితే దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. బూస్టర్ డోస్‌ల పేరుతో వ్యాక్సిన్ నిల్వలను అంటిపెట్టుకోవద్దని వాటి పేద దేశాలకు అందజేయాలని సూచించింది. అయితే మనదేశంలో బూస్టర్ డోస్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు మీడియాకు తెలిపింది.
అవసరమైతే, మూడో డోసు తీసుకోవచ్చని, రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల అనంతరం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. భారత్ అందజేస్తున్న వ్యాక్సిన్ ధ్రువపత్రాన్ని 100కు పైగా దేశాలు అంగీకరిస్తున్నాయని వివరించారు. ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.