కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… ప్రభుత్వ ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ సెంటర్లు, పీహెచ్‌సీల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుండగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం డబ్బులు చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి.. అయితే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది… ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.. ఈ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించారు.. ఉచిత టీకా డ్రైవ్‌ను విస్తరించేందుకు మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద నిధులకు సహాయం చేయమని కార్పొరేట్‌లను కోరింది సర్కార్.. అందులో భాగంగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వ్యాక్సిన్‌కు శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వ్యాక్సిన్లను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్న ప్లాన్‌లో భాగంగానే ఈ కార్యక్రమానికి పునుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. ప్రైవేట్ ఆసుపత్రులకు 25 శాతం వ్యాక్సిన్లు వచ్చినా.. తమిళనాడులో ఇప్పటి వరకు 5 శాతం మాత్రమే వాటిని ఉపయోగించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. దీంతో.. ప్రైవేట్‌లోనూ ఉచిత టీకాను ప్రారంభించారు.
కాగా, జూన్ 21 నుండి వ్యాక్సినేషన్ కొత్త దశలో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 75 శాతం వ్యాక్సిన్లను సేకరించే ఖర్చులను కేంద్రం భరిస్తుండగా, మిగిలిన 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించింది.. కార్పొరేట్ సంస్థలను తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) ద్వారా నిధులు సమకూర్చాలని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించగా, ప్రైవేట్ ఆస్పత్రులు కూడా తమ సొంత సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఈ డ్రైవ్‌లో భాగం కాగలవని ప్రభుత్వం తెలిపింది. ఉచిత టీకా డ్రైవ్‌తో పాటు, ప్రైవేటు ఆసుపత్రుల ధరలకు టీకాలు అందించే ప్రస్తుత పద్ధతి కూడా కొనసాగుతుంది.