ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే మంగళవారానికి తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. గురువారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. బెయిల్ పిటిషన్‌పై ఇరువైపుల నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇంకా ఏమైనా వాదనలు వినిపించాల్సి ఉంటే.. లిఖిత పూర్వకంగా ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా.. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కేసు విచారించారు. ఇరువైపుల నుంచి వాదనలు విన్న తర్వాత తీర్పును సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Ravindra Jadeja: బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రిని తీహార్ జైలుకు తరలించారు. అనంతరం పలుమార్లు బెయిల్ పిటిషన్లు అప్లై చేసుకున్నా తిరస్కరణకు గురయ్యాయి. మధ్యలో ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినా సీబీఐ రూపంలో నిరాశ ఎదురైంది. హైకోర్టులో పిటిషన్ వేయడంతో బెయిల్‌పై స్టే విధించింది. ఇక లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం ప్రచారం కోసం 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించాయి. జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం కేజ్రీవాల్ మాత్రమే జైల్లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Ukraine conflict: రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్, చైనా మధ్యవర్తిత్వం.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..