Supreme Court Key Comments on Freebies: రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై బుధవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలపై వాడీవేడీ చర్చ జరిగింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం ఉచితాలపై పలు వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఉచిత పథకాలకు వ్యతిరేకంగా తన వాదనలను కొనసాగింది. అయితే ‘ ఉచితాలు’ అంటే ఏమిటని సుప్రీం ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు, న్యాయవాది అయిన అశ్విని ఉపాధ్యాయ్ వేసిన పిల్.. ఇప్పుడు ఉచితాలపై చర్చకు దారి తీసింది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేయాలని ఆయన పిల్ దాఖలు చేశారు.
తాజాగా ఈ రోజు విచారించిన ధర్మాసనం రాజకీయ పార్టీలు తమ స్పందనలు తెలియజేయాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పక్షాలు లిఖిత పూర్వకంగా తమ స్పందన తెలియజేయాలని సోమవారానికి విచారణ వాయిదా వేసింది. ఓటర్లకు వాగ్ధానాలు చేయకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేమని కొంత మంది అంటున్నారని.. అయితే ఈ ఉచితాల అంటే ఏమిటో నిర్వచించాల్సి ఉందని సుప్రీం అభిప్రాయపడింది.
Read Also: South Central Railway: రేపటి నుంచి పట్టాలెక్కనున్న గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీరు వంటివి ఉచితాలుగా పరిగణించవచ్చా..? ప్రజల హక్కా..? అని ప్రశ్నించింది. ఉపాధి హామీ పథకం ఉచితం ఎలా అవుతుందని పిటిషనర్ ను ప్రశ్నించింది కోర్టు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హమీలు ఇవ్వకుండా నిరోధించలేమని.. ఎన్నికల్లో హామీలే గెలిపిప్తాయని నమ్మడం లేదని.. హామీలు ఇచ్చిన వారందరూ గెలవరు కదా.. అని వ్యాఖ్యానించింది. ఉచితాలను రద్దు చేయాలనే పిటిషన్ పై పలు పార్టీలు స్పందిస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఉచితాలెలా అవుతాయని డీఎంకే, ఆప్ వంటి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఉచితాలు, సంక్షేమ పథకాలు రెండూ వేరువేరని గత వారం విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.