South Central Railway: కడప మీదుగా గుంటూరు-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. గుంటూరులో ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12:45 గంటలకు చేరుతుందన్నారు. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4:25 గంటలకు చేరుతుంది. తిరుపతిలో ఈ నెల 19న రాత్రి 7:35 గంటలకు బయలుదేరి కడపకు రాత్రి 9:55 గంటలకు చేరుకుని మరుసటిరోజు ఉదయం 8 గంటలకు గుంటూరు చేరుతుందని డి.నరసింహారెడ్డి వివరించారు.
Read Also: Andhra Pradesh RGF: కర్ణాటకలో కేజీఎఫ్.. ఆంధ్రాలో ఆర్జీఎఫ్..!!
అటు హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గేలా రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. పీఎం గతిశక్తి పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరులోని యలహంక స్టేషన్ వరకూ 503 కిలోమీటర్ల మేర సెమీ హైస్పీడ్ రైల్వే ట్రాక్‌ను నిర్మించేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ఇందుకోసం రూ.30వేల కోట్లను ఖర్చు పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించే వీలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. హైస్పీడ్ రైలు ప్రయాణానికి అడ్డంకులు ఎదురవ్వకుండా ట్రాక్‌కు ఇరువైపులా 1.5 మీటర్ల ఎత్తుతో ఫెన్సింగ్ వాల్ నిర్మించనున్నట్టు తెలియజేశారు.