ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ప్రేమజంటలకు శివసేన కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. వాలంటైన్స్‌డే రోజు ఎవరైనా పార్కుల్లో జంటలుగా కనిపిస్తే.. చితక్కొడతామని స్పష్టం చేశారు. వాలెంటైన్స్‌డే సందర్భంగా తాము వివిధ ప్రాంతాల్లో కర్రలను చేతబూని తిరుగుతామని, ఏ జంటలైనా కనిపించాయో.. వారికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం నాడు భోపాల్‌లో శివసేన కార్యకర్తలు కర్రలు చేతబూని వాటికి కాళికా దేవి మందిరంలో పూజలు కూడా నిర్వహించారు.
అటు వాలంటైన్స్ డే సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే తెలంగాణలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలకు ప్రేమజంటలకు సందేశం పంపించారు. తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని, కేవలం విదేశీ విష సంస్కృతికి మాత్రమే వ్యతిరేకం అని విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ అధ్యక్షుడు ఎం.రామరాజు అన్నారు. వాలంటైన్స్ డే అనేది విష సంస్కృతి అని, దాన్ని ప్రభుత్వాలు నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రేమికుల రోజు పేరిట యువత బయట షికార్లు కొడితే అడ్డుకుని కౌన్సెలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. అయితే భజరంగ్ దళ్ కార్యకర్తలు అని చెప్పుకుంటూ కొందరు ప్రేమికుల రోజున జంటలకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని, తాము అలాంటి పనులు చేయబోమని తెలిపారు.