Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర విభేదాలకు కారణమవుతోంది. శశిథరూర్ తీరుపై హస్తం పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా, గతంలో ప్రధాని మోడీని విమర్శిస్తూ శశిథరూర్ రాసిన పుస్తకం ‘‘ పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్’’ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ని ప్రధాని ప్రచారం చేశారని, మోడీ ప్రభుత్వానికి సిగ్గులేదని థరూర్ అభివర్ణించడాన్ని పవన్ ఖేరా ఎత్తిచూపారు.
Read Also: Shakur Khan: పాక్ గూఢచారి షకుర్ ఖాన్ అరెస్ట్.. రాజస్థాన్ మాజీ మంత్రితో సంబంధాలు!
థరూర్ రాసిన 2018 పుస్తకంలోని అదే పేరాలో, గతంలో కాంగ్రెస్ అలాంటి దాడులను ఎప్పుడూ కీర్తించలేదని థరూర్ రాసిన భాగాన్ని ఖేరా హైలైట్ చేశారు. ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచదేశాలకు తెలియజేసే దౌత్య బృందాల్లో ఒక దానికి కాంగ్రెస్ ఎంపీ థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన పనామాలో మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించడంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
శశి థరూర్ వ్యాఖ్యల తర్వాత, కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూపీఏ ప్రభుత్వ హాయాంలో ఆరు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, కానీ ఎప్పుడూ ప్రచారం చేయలేదని పేర్కొంది. మన్మోహన్ సింగ్ పాత ఇంటర్వ్యూని పోస్ట్ చేసిన పవన్ ఖేరా, మాజీ ప్రధాని హయాంలో భారత్ అనేక సర్జికల్ స్టైక్స్ నిర్వహించిందని చెప్పారు. అయితే, థరూర్‌ని సమర్థిస్తూ బీజేపీ రంగంలోకి దిగింది.