ఓవైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఏ రాష్ట్రంలోలేని విధంగా అక్కడ ఏకంగా ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగియగా.. మరో మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక, ఎన్నికల ముందు నుంచీ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. ప్రధాని మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన టీఎంసీ అధినేత, సీఎం మమతాబెనర్జీ.. అసలు కరోనా సెకండ్ సృష్టించింది మోడీయే నంటూ ఫైర్ అయ్యారు.
ఇవాళ దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని బాలూర్‌ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన మమతా బెనర్జీ.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడానికి ప్రధాని మోడీయే కారణమని ఆరోపించారు. సెకండ్ వేవ్‌ను మోదీ సృష్టించిన విపత్తుగా కామెంట్ చేశారు.. దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోందని.. నేను దీనిని మోడీ సృష్టించిన విప్తే అంటాను అంటూ పేర్కొన్నారు దీదీ.. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. ఆస్పత్రుల్లో సరిపడా ఇంజెక్షన్‌లు లేవు. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది.. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా.. కరోనా టీకాలను, ఔషధాలను మాత్రం విదేశాలకు తరలించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.