Sanjay Raut: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అజిత్ పవార్, శరద్ పవార్ కలిపోతారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే, బీజేపీ సర్కార్ అంటేనే విరుచుకుపడే శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. గడ్చిరోలి జిల్లాలో 11 మంది నక్సలైట్లు సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. దీనిపై సంజయ్ రౌత్ ప్రశంసించారు. విలేకరులతో మాట్లాడుతూ.. తాను గతంలో ఫడ్నవీస్‌తో పనిచేశానని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన చేసిన కార్యక్రమాలను అభినందించాల్సిందేనని అన్నారు.
Read Also: PM Modi: నాకు ‘‘శీష్ మహల్’’ లేదు.. కేజ్రీవాల్‌పై ప్రధాని మోడీ కామెంట్స్..
శివసేన మౌత్ పీస్ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఫడ్నవీస్‌ని ప్రశంసించారు. ప్రభుత్వం మంచి పనిచేసిందని, ఫడ్నవీస్‌ని మేము మెచ్చుకున్నామని, నక్సలైట్లు లొంగిపోయి రాజ్యాంగ మార్గాన్ని ఎంచుకుంటే దానిని మేం స్వాగతిస్తామని అన్నారు. మహారాష్ట్ర మా రాష్ట్రం, నక్సలిజం ప్రభావితమైన గడ్చిరోలిలో ఇలాంటి కార్యక్రమాలను ప్రశంసించాల్సిందే అని చెప్పారు.
హఠాత్తుగా ‘మహా’ రాజకీయాల్లో ఇలాంటి ప్రశంసలు రావడం సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు గానూ 230 సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీడీ)లోని పార్టీలకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా తగ్గలేదు. ఠాక్రే శివసేన 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ 10 స్థానాల్లో మాత్రమే గెలిచారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి వైపు ఇతర పార్టీల నేతలు దృష్టిసారిస్తున్నాయని తెలుస్తోంది.