Sanjay Nirupam: కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడిని మహారాష్ట్ర నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 5 అధికార కేంద్రాలు ఉన్నాయని, వారిలో ఒకరంటే ఒకరికి పడటం లేదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఆయన గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పతనమైన పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో విపరీతమైన అహంకారం పెరిగిపోయిందని ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.
Read Also: Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన గౌరవ్ వల్లభ్
సంజయ్ నిరుపమ్ తన ప్రసంగాన్ని ‘జైశ్రీరాం’ అంటూ ప్రారంభించారు. కాంగ్రెస్‌లో 5 అధికార కేంద్రాలు ఉన్నాయని, ఆ ఐదుగురికి సొంత లాబీలు ఉన్నాయని చెప్పారు. మొదటి పవర్ సెంటర్ సోనియాగాంధీ, రెండోది రాహుల్ గాంధీ, మూడోది ప్రియాంకాగాంధీ, నాలుగోది పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఐదో వ్యక్తి కేసీ వేణఉగోపాల్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకపై జాతీయ పార్టీ కాదని అన్నారు. మహారాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని పట్టించుకోవడం లేదని, అతని దురహంకారం మరోస్థాయిలో ఉందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బీహార్‌లో పరిశ్రమల్లా తయారైందని విమర్శించారు.
శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు చేయడంతో సంజయ్ నిరుపమ్‌పై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ చర్యల్ని సిఫారసు చేస్తూ హైకమాండ్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో నిన్న సంజయ్ నిరుపమ్‌ని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, తానే ముందుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, రాజీనామాను చూసి తనను పార్టీ తొలగించిందని ఆయన చెబుతున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్‌ని సంప్రదించకుండా తన అభ్యర్థుల్ని ప్రకటించారు. ముంబై నార్త్-వెస్ట్ సీటను ఆశిస్తున్న సంజయ్ నిరుపమ్‌ని కాదని శివసేన తన అభ్యర్థిగా అమూల్ కీర్తికర్‌ని ప్రకటించింది. దీంతో సంజయ్ నిరుపమ్ ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.