RBI to launch Digital Rupee on Dec 1 in four cities: కాలానికి అనుగుణంగా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త ఒరవళ్లు రూపుదాల్చుకుంటున్నాయి. అందులో భాగంగానే.. తాజాగా డిజిటల్ రూపాయి వచ్చింది. రేపటి నుంచే ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తోందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ డిజిటల్ రూపాయి కోసం ఆర్బీఐ.. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లోని ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, యస్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిని ‘ఈ-రూపాయి’గా కూడా వ్యవహరిస్తారు. అయితే.. ఇది తొలుత కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ)కు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
అసలు ఈ డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? ఇదేమీ క్రిప్టో కరెన్సీ కాదు. చట్టపరమైన టెండర్‌ను సూచించే డిజిటల్ టోకెన్ మరో రూపమే ఇది. మన పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే.. దీనికీ విలువ ఉంటుంది. వినియోగదారులు, వ్యాపారులకు.. బ్యాంకుల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా.. ఈ-రూపాయితో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. లేకపోతే.. మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల్లోనూ నిల్వ చేసుకోవచ్చు. చివరికి.. వ్యక్తి, వ్యాపారి మధ్య కూడా ఈ డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎలాగైతే ప్రస్తుతం క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి.. ఆ తరహాలోనే ఈ-రూపాయితో చెల్లింపులు జరుపుకోవచ్చు. ఈ డిజిటల్ రూపాయిని బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉంచితే.. వడ్డీ లభిస్తుంది.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా.. ప్రస్తుతం నాలుగు నగరాల్లో మాత్రమే ఈ డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఈ-రూపాయిని విస్తరించనున్నట్టు వెల్లడించింది. దశల వారీగా.. ఇతర నగరాలకు కూడా విస్తరిస్తారు. అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అందబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది.