రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను ఉద్దేశిస్తూ రాజస్థాన్ మంత్రి బీజేపీ నేతలను రావణుడి భక్తులతో పోల్చారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని రావణుడి భక్తులు అని మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హిందూ భక్తులు అని చెప్పుకుంటున్నారని.. కానీ వాళ్లు రాముడి విధానాలను పాటించడం లేదని ఆరోపించారు.
రాముడు తన రాజ్యంలో అందరినీ సమానంగా చూశాడని.. రావణుడు మాత్రం మోసగాడు అని మంత్రి ప్రతాప్ సింగ్ తెలిపారు. అలాగే దేశంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడటం లేదని మంత్రి ప్రతాప్ సింగ్ ఆరోపించారు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే కేంద్రం ఇంధన ధరలు పెంచడం సరికాదని మంత్రి ప్రతాప్ సింగ్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా టికెట్లను పంచిపెడుతున్నట్లుగా బీజేపీ నేతలు ప్రజలకు పెట్రోల్, డీజిల్ కోసం కూపన్లు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.