పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. జనవరి 3న మోగాలో జరిగే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లలో 77 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సాద్-బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 20 సీట్లు గెలిచి రెండవ పెద్ద పార్టీగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లు మాత్రమే గెలుచుకోగా, బీజేపీ కేవలం 3 సీట్లు సాధించింది.
ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. కాగా అటు పంజాబ్, ఇటు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం ఉన్నా ప్రియాంక గాంధీ సభలు, ర్యాలీలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు పార్టీ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి రాహుల్‌గాంధీ జనవరి 3 నుంచి ప్రచారంలో పాల్గొంటుండంతో అటు పంజాబ్ కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారం కైవసం చేసుకోవాలనే కోణంలో కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంది.