Putin: వెస్ట్రన్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫైర్ అయ్యారు. భారత్, రష్యా బంధాన్ని పశ్చిమ దేశాలు విడదీయలేవని ఆయన అన్నారు. భారతదేశం తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. సోచి నగరంలో రష్యాన్ బ్లాక్ సీ రిసార్టులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వెస్ట్రన్ దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని ఆమోదించని దేశాలను శత్రవుగా చూస్తున్నాయని, భారత్ తో పాటు చాలా దేశాలు ప్రమాదంలో ఉన్నాయని, అయితే భారత్ తన తన ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, అది స్వతంత్ర దేశమని, రష్యాను భారత్ నుంచి దూరం చేసే పశ్చిమ దేశాల ప్రయత్నాలు ఫలించవని పుతిన్ అన్నారు. తన స్నేహితులు ఇబ్బందులు పడొద్దనే తాను ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలకు వెళ్లలేదని ఆయన తెలిపారు. ఆ సదస్సు పొలిటికల్ షోగా మారొద్దనే తాను గైర్హాజరైనట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ నాయకత్వంలో భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. రష్యా మాదిరిగానే భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా తన ముద్ర వేస్తున్నారని చెప్పారు. అంతకుముందు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని పుతిన్ కొనియాడారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అనేక వెస్ట్రన్ దేశాలు, అమెరికా మిత్రదేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే ఆ సమయంలో భారత్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసింది. ఈ విషయంలో వెస్ట్రన్ దేశాలు భారత్ పై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా.. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఆపలేదు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.