Priyanka Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 సీట్లకు గానూ 136 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 65 స్థానాల్లో గెలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇప్పుడంతా రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య 2024లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
Read Also: Bengaluru City: బెంగళూరు సిటీలో సత్తా చాటిన కాంగ్రెస్.. అర్బన్‌లో బీజేపీ డీలా..
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా చేయాలని పార్టీ నుంచి వస్తున్న విజ్ఞప్తులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పందించారు. ‘‘ప్రజలే భవిష్యత్తును నిర్ణయిస్తారు’’ అని అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశమని అభివర్ణించిన సిద్ధరామయ్య, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఇది గీటురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీయేతర పార్టీలన్నింటి ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించేలా చూస్తానని, రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని ఆశిస్తున్నాని సిద్దరామయ్య అన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయాలనే పెరుగుతున్న వినతుల నేపథ్యంలో ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ..కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పెద్ద బాధ్యత అని, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజల కోసం పనిచేయాలి, తర్వాత ఏం జరుగుతుందో ప్రజలే చెబుతారని ఆమె వ్యాఖ్యానించింది. ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు ఇకపై దేశంలో పనిచేయవని, హిమాచల్ లో చూశాం, కర్ణాటకలో ఇదే తెలిసిందని, ప్రజలు తమ సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు.