వివాదాస్పదమైన ప్రైవసీ పాలసీని వాట్సాప్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్, భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వినియోగదారులు ఈ పాలసీని అంగీకరించాలని ఒత్తిడి చేయబోమని తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చేవరకు తాము దీన్ని అమలు చేయమని.. హైకోర్టుకు తెలిపింది. ఒకవేళ బిల్లు దీన్ని అనుమతిస్తే.. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తామని వాట్సాప్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
వాట్సాప్ కొత్త పాలసీ ఫిబ్రవరిలోనే అమల్లోకి రావాల్సింది. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో అది వాయిదాపడి, మే 15న అమల్లోకి వచ్చింది. అయితే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మేలో కేంద్రం రాసిన లేఖపై కొద్ది రోజుల తర్వాత వాట్సాప్ స్పందించింది. వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. ఫిబ్రవరిలో కేంద్రం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు.. వాట్సాప్, కేంద్రం మధ్య వివాదానికి కారణమయ్యాయి.