PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరిగిన ‘‘మహాకుంభమేళా’’ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్‌లో కొనియాడారు. లోక్‌సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారతదేశ కొత్త తరం మహా కుంభమేళాతో కనెక్ట్ అయిందని, న్యూ జనరేషన్ సంప్రదాయాలు, విశ్వాసాన్ని గర్వంగా స్వీకరిస్తోందని, కుంభమేళ ప్రపంచం మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిందని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత, మేము దానిని ప్రయాగ్‌రాజ్‌లో చూశామని’’ ప్రధాని మోడీ అన్నారు. కుంభమేళ సక్సె్స్‌కి కృషి చేసిన యూపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన కుంభమేళాకి దేశవిదేశాల నుంచి 66 కోట్ల మంది భక్తులు వచ్చారు.
Read Also: SC Classification: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్ రియాక్షన్!
అయితే, ప్రధాని ప్రశంసలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘కుంభమేలా మన సంప్రదాయాలను, చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము. అయితే, కుంభమేళలో మరణించిన వారికి ప్రధాని నివాళులు అర్పించలేదనేదే మా ఫిర్యాదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రయాగ్ రాజ్ తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రధాని నివాళులు అర్పించాల్సిందని రాహుల్ గాంధీ అన్నారు.
కుంభమేళాలో యువత పని అవకాశాలను ఆశించారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, కానీ వారు అనుమతించలేదని, ఇది న్యూ ఇండియా అంటూ రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు కుంభమేళా గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మహా కుంభమేళా గురించి ఆశావాదంతో మాట్లాడారని, ప్రతిపక్షాలకు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అవకాశం ఇవ్వాలని, ప్రతిపక్షాలకు కేవలం రెండు నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు.