Prajwal Revanna: కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సెక్స్ టేపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ జేడీయూ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల నుంచి భారత్‌కి వస్తున్నారు. పలువరు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో ఇతను కీలక నిందితుడిగా ఉన్నారు. గత నెలలో కర్ణాటకలోని హసన్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజ్వల్ రేవణ్ణవిగా చెప్పబడుతున్న సెక్స్ వీడియోలు వైరల్‌గా మారడం సంచలనంగా మారిన సంగతి తెలిసింది. రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయాడు.
Read Also: Accident: జమ్మూలో ఘోర ప్రమాదం..150 అడుగుల లోయలోకి బస్సు.. 16 మంది మృతి
ఈ కేసును విచారించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రేవణ్ణ కోసం పలుమార్లు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇంటర్ పోట్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇతని దౌత్య పాస్‌పోర్టు రద్దుకు కేంద్రం సమాయత్తమవుతున్న నేపథ్యంతో ఆయన ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా సోమవారం ఓ వీడియో ప్రకటన జారీ చేశారు.
ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలోని మ్యూనిచ్ నగరం నుంచి బెంగళూర్ వస్తున్న విమానం ఎక్కారు. అతను స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.20 గంటలకు విమానం ఎక్కాడు. అతడిని ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేసేందుకు కర్ణాటక పోలీసులు సిద్ధమయ్యారు. నిన్న ఆ రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ, ప్రజ్వల్ రేవణ్ణని ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.