H-1B visa: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ఎలా ఉంటుందని ప్రపంచం అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా భారతీయులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా H-1B పరిమితులు ప్రధాని నరేంద్రమోడీ ఆత్మనిర్బర్ భారత్ చొరవను ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. భారతదేశ ఆర్థిక స్వావలంబన ప్రయత్నాలను ప్రోత్సహించవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సోమవారం తన నివేదికలో పేర్కొంది. కఠినమైన వీసా నియమాలు యూఎస్ లోని భారతీయ ఐటీ సంస్థలకు ఖర్చులను పెంచుతాయి. ఇవి స్థానిక తయారీ, ఆర్థిక స్వాతంత్య్రం వైపు భారత్‌ని మరింత దృష్టి పెట్టేలా చేయగలవు.
“కఠినమైన H-1B నియమాలు USలోని భారతీయ IT కంపెనీలకు ఖర్చులను పెంచుతాయి. అక్కడికి వెళ్లే వర్కర్లను తగ్గించగలదు. ఈ సంస్థలు అధిక ఖర్చులతో స్థానికులను నియమించుకునేలా ఒత్తిడి పెరుగుతుంది’’ అని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు మన దేశంలో ఈ మార్పు దేశీయ ఉత్పత్తి, స్వయం సమృద్ధి, విదేవీ పెట్టుబడుల సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతించొచ్చు.
H-1B వీసా ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
H-1B వీసా ప్రోగ్రామ్ అనేది అర్హతలు కలిగిన ప్రత్యేమైన నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలోకి అనుమతిస్తుంది. అక్కడి కంపెనీలు నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ని ఈ వీసా ప్రోగ్రాం కింద నియమించుకోవచ్చు. ఈ వీసా ప్రోగ్రాం కింద నైపుణ్యం కలిగి స్థానికులు లేనప్పుడు, అర్హతలు కలిగిన ఇతర దేశాల వర్కర్లను నియమించుకోవచ్చు. ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం కొత్త H-1B వీసాలను 65,000కి పరిమితం చేస్తుంది. యూఎస్‌లో మాస్టర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తుల కోసం అదనంగా 20,000 కేటాయించబడుతోంది. విద్యా, నాన్ ప్రాఫిట్ లేదా రీసెర్చ్ సెక్టార్లను ఈ పరిమితి నుంచి మినహాయించారు.
H-1B వీసాలపై ట్రంప్ వైఖరి:
ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో H-1B వీసాలను నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. అమెరికాలో కార్మికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన వాదన. అంతకుముందు ట్రంప్ పాలనలో H-1B వీసాల రిజక్షన్ రేట్ పెరిగింది. ఇండియా కంపెనీల హైరింగ్‌పై ప్రభావం పడింది. 2020లో, ట్రంప్ పరిపాలన H-1B వీసా హోల్డర్‌లకు అధిక కనీస వేతన అవసరాలను అమలు చేయడానికి ప్రయత్నించింది, అయితే ఈ చర్య తరువాత US కోర్టులలో నిరోధించబడింది.
ట్రంప్ మొదటి టర్మ్‌లో ప్రతీ ఏడాది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను ఒక మిలియన్ వరకు ఇచ్చారు. అయితే, 2023లో ఇండియన్స్‌కి ఇచ్చే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు దాదాపుగా 1.4 మిలియన్‌లకు చేరిందని ఎస్‌బీఐ తన రిపోర్టులో చెప్పింది. ట్రంప్ ఈ వీసాలపై పరిమితి విధిస్తే ఇండియాకు నాణ్యమైన వర్క్‌ఫోర్స్ మరింతగా దొరికే అవకాశం ఉంటుంది.
ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయుల H-1B వీసా కలలు చెరిగిపోతాయి. అమెరికాలో ఈ వీసాలను పొందుతున్న దేశాల్లో భారతీయులే ఎక్కువ. 2023లో మొత్తం H-1B వీసాల్లో దాదాపుగా 72.3 శాతం అంటే 2,79,000 మంది H-1B వీసాలు పొందారు. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ప్రధానంగా కంప్యూటర్ సంబంధిత రోల్స్‌కి వీరిని హైర్ చేస్తున్నారు.