తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్న వేళ ఆ మద్దతును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ఇలా దాడులు చేస్తుందా అనే సందేహాన్ని ప్రధాని వెలిబుచ్చారు.
Read: మహారాష్ట్రను వదలని కరోనా… మళ్లీ 40 వేలు దాటిన కేసులు…
బండి సంజయ్‌తో పాటు ఎంతమంది జైలుకు వెళ్లారు, ఎంత మందికి గాయాలయ్యాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తు ఇప్పటి వరకు 9 సార్లు జైలుకు వెళ్లినట్టు ప్రధానికి బండి సంజయ్ తెలిపారు. ప్రజా సమస్యలపై అద్భుతంగా పోరాటం చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్య పరిమితులకు లోబడి పోరాటాన్ని కొనసాగించాలని ప్రధాని సూచించారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మద్దతుకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ నెల 5 వ తేదీన పంజాబ్‌లో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. జాగరణ దీక్ష ఘటనలో గాయపడ్డ బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకొని వారికి మనోధైర్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.