Petrol Price At AP: పెట్రోల్ ధరలు సెంచరీ దాటి.. నూటి పది కూడా దాటింది. అయితే అత్యధికంగా ఏ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధర ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుసా? పెట్రోల్ ధరలపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పన్నులు ఎక్కువగా ఉండటంతో సెంచరీ మార్కును దాటేసింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, బ్యారెల్ ధర తగ్గినప్పటికీ ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవు. కారణం ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు. వాస్తవ పెట్రోలియం ధర కంటే పన్నులు అధికంగా ఉండటంతో.. ధరలు సెంచరీ మార్క్ ను దాటేశాయి. 15 ఏళ్ల క్రితం రూ. 30లోపు లీటర్ ఉన్న పెట్రోల్ ధర కాస్త.. ఇపుడు రూ. 110కి చేరింది. అయితే వీటికి తోడు మరో షాకింగ్ విషయం ఏమిటంటే పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర నూటపది దాటేసింది. దేశంలో ఏపీలోనే పెట్రోల్ ధర అధికంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87 ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి వెల్లడించారు.
Read also: Tomato: నా టమాటాలు పోయాయి సార్.. పూణెలో పోలీస్ స్టేషన్లో మొదటి కంప్లైంట్
గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పెట్రో ఉత్పత్తులపై దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదా? అని రాజస్థాన్ బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పన్ను ఆ ధారంగా ఆయా రాష్ర్టాల్లో పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తుల ధరలు ఉన్నాయని వివరించారు. జూలై 18 వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీ కంటే తెలంగాణలోనే ధరలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 109.66, డీజిల్ ధర రూ.97.82గా ఉన్నది. కేరళలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.73 కాగా, డీజిల్ ధర రూ.98.53గా ఉన్నది. అయితే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం అజమాయిషీ ఉండాలని.. ప్రజలు నిత్యం వాడే పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో మాదిరిగా ధరల నియంత్రణ పెట్రోలియం సంస్థల చేతుల్లో కాకుండా కేంద్రం చేతిలో ఉండాలని కోరుతున్నారు.