Ram Mandir: జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. గురువారం రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సాధువులతో సహా మొత్తం 7000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది. దీంతో పాటు పలు దేశాలకు చెందిన రాయబారులు, విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. పలు దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది.
Read Also: Ram Mandir Features: అయోధ్య భవ్య రామ మందిర ప్రత్యేకతలు ఇవే..
భారతదేశంలో కన్నుల పండగగా జరగబోతున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసి దాయాది దేశం పాకిస్తాన్ కడుపు రగిలిపోతోంది. భారత వ్యతిరేక ప్రచారానికి తెరతీసినట్లుగా తెలుస్తోంది. ఒక్క మనదేశంలోనే కాదు, పాకిస్తాన్ మీడియాలో కూడా రామ మందిరం ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో రామ మందిరానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ రహస్య సోషల్ మీడియా ప్రచారం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, భారత వ్యతిరేకతను నూరిపోయడానికి పాకిస్తానీ ట్విట్టర్ ఖాతాలు అన్ని ప్రయత్నిస్తున్నాయి. బాబ్రీ మసీదుకు మద్దతు తెలియజేస్తూ.. రామమందిర వ్యతిరేక కంటెంట్‌ని షేర్ చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా రామ మందిరాన్ని దాని వాస్తవ స్థలంలో కాకుండా మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారనే తప్పుడు వాదనతో ప్రచారం చేస్తున్నారు.