Pakistan: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఆదివారం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఒక్కసారిగా బస్సులోయలో పడిపోయింది. ఈ దాడిలో 09 మంది మరణించారు. ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న రోజునే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ లష్కరేతోయిబాకు అనుబంధంగా ఉన్న ఉగ్రసంస్థ ప్రకటించింది. ఉగ్రవాదులు ‘జింగిల్ వార్‌ఫేర్’లో శిక్షణ పొంది, అడవుల్లోని గుహాల్లో రోజుల తరబడి నివసిస్తూ దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి మే నెలలో జరిగిన పూంచ్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్ అటాక్‌కి సంబంధం ఉన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే, రియాసి టెర్రర్ అటాక్‌పై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) మాజీ ప్రధాని రాజా ఫరూఖ్ హైదర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైనిక చర్యకు పాల్పడవచ్చని, పాకిస్తాన్ పూర్తిగా సిద్ధంగా ఉండాలని కోరారు. ఎక్స్ వేదికగా ఒక పోస్టులో.. ‘‘రియాసి దాడిని సాకుగా చూపి ఆజాద్ కాశ్మీర్‌లో ఏదైనా భారతీయ దుస్సాహసానికి పాకిస్తాన్ పూర్తిగా సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఆదివారం కత్రా నుంచి శివ్ ఖోరీ మందిరానికి ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు ప్లాన్ చేసి దాడికి తెగబడ్డారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లతో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు.
Pakistan should be fully prepared for any Indian misadventure in Azad Kashmir in pretext of Riasi attack
— Raja Muhammad Farooq Haider Khan (@farooq_pm) June 10, 2024