Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కి తీరని నష్టాన్ని మిగిల్చింది. పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు తర్వాత, భారత్ దాయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. అయితే, దీని తర్వాత పాక్ సైన్యం భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఈ దాడులకు ప్రతిగా భారత్ మే 10 తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. మొత్తం 11 ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళం 20 శాతం ఆస్తుల్ని కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా శాటిలైట్ చిత్రాలను బట్టి చూస్తే.. పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ రావల్పిండికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డ్రోన్స్, వీఐపీ ఎయిర్ ఫ్లీట్‌కి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ కేంద్రంగా ఉంది. ఇది పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కి 25 కి.మీ లోపే ఉంది. భారత్ దాడి చేసిన ప్రదేశానికి సమీనంలోని మొత్తం కాంప్లెక్స్ ఇప్పుడు మొత్తం కూల్చివేయడినట్లు వెల్లడైంది.
Read Also: Jagadish Reddy: తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేని ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలి..
ఈ వైమానిక స్థావరంలోని మౌలిక సదుపాయాలు, గ్రౌండ్ సపోర్ట్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఖచ్చితమైన దాడులు నిర్వహించిందని రక్షణ రంగ విశ్లేషకుడు డామియన్ సైమన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ స్థావరం పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా ఉండటం, వైమానిక మొబిలిటీ కార్యకలాపాలకు కమాండ్ సెంటర్‌గా పనిచేస్తున్నందున, ఈ దాడిని వ్యూహాత్మకంగా, ప్రతీకాత్మకంగా చూశారు. ఈ స్థావరంలో ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టమ్ సాబ్ ఎరియే వ్యవస్థతో పాటు, C-130 రవాణా విమానాలు,IL-78 మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నాయి.
ఈ స్థావరంలో టర్కిష్ తయారీ బైరెక్టర్ టీబీ 2 డ్రోన్లు, పాక్ స్వదేశీ తయారీ షాపర్-1 డ్రోన్లు ఉన్నాయి. పాక్ డ్రోన్ యుద్ధ వ్యూహాలకు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కేంద్రంగా ఉంది. ఇది పాక్ అధ్యక్షుడి విమానాలతో పాటు దేశంలో ఉన్న పైలట్ శిక్షణ, వీఐపీ విమానాలకు కేంద్రంగా ఉంది. మే 11 తెల్లవారుజామున ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తనకు ఫోన్ చేసి, భారత్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై క్షిపణులతో దాడులు చేసిందని చెప్పారని ఇటీవల ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. మే 10న, పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఉదయం 4 గంటల విలేకరుల సమావేశంలో భారతదేశం నూర్ ఖాన్ (రావల్పిండి), మురిద్ (చక్వాల్), మరియు రఫికి (ఝాంగ్) వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ధృవీకరించారు.